కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025ను తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సి. లింగన్న డిమాండ్ చేశారు. ఈ చట్టం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నిర్మల్ జిల్లాలో పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.
పెన్షనర్ల సంఘం సభ్యులు తహసీల్దార్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి, కలెక్టర్ కార్యాలయం వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కు పెన్షనర్ల సంఘం నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సి. లింగన్న మాట్లాడుతూ, పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని పునరుద్ఘాటించారు. ఈ విధానం వల్ల పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు.
జనవరి 1, 2026 కంటే ముందు, ఆ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారిని వేర్వేరుగా విభజించి, వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోందని లింగన్న పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్ వారి జీవిత భద్రతకు, గౌరవానికి ఆధారమని, ఇది కేవలం ఆర్థిక లావాదేవీ కాదని, ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి ప్రత్యేక గుర్తింపు అని ఆయన అన్నారు. పెన్షన్ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు పెన్షనర్లలో గందరగోళాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయని తెలిపారు. పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్ధన్, జిల్లా బాధ్యులు లోలం గంగన్న, డాక్టర్ నాగేశ్వరరావు, కరీం, కున పోశెట్టి, డాక్టర్ రజిని, రామా గౌడ్, ఎం. రాజేశ్వర్, యూనిట్ బాధ్యులు కే. రమేష్, జనార్దన్, బాలకిషన్, జగదీశ్వర్, రాములు, బొడ్డు లక్ష్మణ్, జాప రాములు, పోతన్న, వేణుగోపాల్ తో పాటు వందలాదిగా ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.








