మిర్యాలగూడకు చెందిన, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) మధుసూదన్ సోమవారం ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు సంతాపం తెలిపారు.
మిర్యాలగూడలో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మధుసూదన్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆంధ్రజ్యోతి స్టాఫర్ గా పనిచేశారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీపీఆర్ఓ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి, జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన అకాల మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు.
మధుసూదన్ ఆకస్మిక మృతికి ఖాజా హమీదుద్దీన్, రంగా శ్రీనివాస్, ఎండి.అస్లాం, పుప్పాల యాదగిరి, వాడపల్లి రమేష్, కలిమేల నాగయ్య, ఖాజా నాజిముద్దీన్, జి.వెంకన్న, మనోజ్, బి.అశోక్, అయుబ్, రమేష్, జంగా లక్ష్మణ్ యాదవ్, కిషోర్, కె.నాగచారి, మంద సైదులు, గుండా మహేష్, జయరాజు, రాజారామ్ తో సహా అనేక మంది జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మిర్యాలగూడ డివిజన్ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని, అందరికీ ఆదర్శంగా నిలిచిన మధు అన్న (మధుసూదన్) దూరం కావడం చాలా బాధాకరమని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. ఆయన మృతికి విద్యార్థి ఉద్యమం విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ కూడా మధుసూదన్ మృతికి సంతాపం తెలిపారు.
మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడిగా, నల్లగొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ గా తన సేవలను అందించిన మధుసూదన్ మృతికి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ కూడా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఆయన జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలలో వక్తగా సందేశాలు ఇచ్చేవారు.












