హైదరాబాద్, ఆగస్టు 02, 2026
కనీస వేతనాల కోసం కార్మికవర్గం జులై 30, 31 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనల్లో లక్షా 20 వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు, స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాలు వ్యక్తిగత దూషణల చుట్టూ తిరుగుతున్నాయని, ప్రజా సమస్యల వైపు మళ్ళించే ప్రయత్నం చేశారని వి.రాంభూపాల్ పేర్కొన్నారు. అనకాపల్లిలో పోలీసుల తోపులాటలో ఒక కార్మికురాలికి కాలు విరిగింది.
కనీస వేతనాల కోసం కార్మికవర్గం జులై 30, 31 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. సిఐటియు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల వద్ద జరిగిన ధర్నాలు, ముట్టడిలో లక్షా 20 వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు, స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య విమర్శల చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలను ప్రజా సమస్యల వైపు మళ్ళించే ప్రయత్నం చేశారు. కొన్ని జిల్లాలలో అరెస్టులు, నిర్బంధాలు జరిగాయి. అనకాపల్లిలో పోలీసుల తోపులాటలో ఒక కార్మికురాలికి కాలు విరిగింది.
నెలకు రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని, శాశ్వతమైన పనిలో శాశ్వత ఉద్యోగం వుండాలనే సుప్రీంకోర్టు తీర్పును ఇంకెంత కాలం అమలు చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని పాలకులను నిలదీశారు. పాలకులు స్పందించి ఇప్పటికైనా అరకొర వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్న కార్మికులకు రెండు పూటలైనా కడుపు నింపుకోవడానికి కనీస వేతనం అమలు చేయాలి. విదేశీ, స్వదేశీ కంపెనీల యజమానుల చుట్టూ తిరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు రావు. గ్రామీణ పేదల, పట్టణ కార్మికుల ఆదాయం పెరిగితే వారి కొనుగోలుశక్తి పెరుగుతుంది. అప్పుడే ఏ ఒక్కరిని దేబిరించకుండానే రాష్ట్ర అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. కార్మికుల ఆగ్రహాన్ని గుర్తించి కనీస వేతనాల పెరుగుదలకు చర్యలు తీసుకుంటే అది కూటమి పార్టీలకు ప్రయోజనకరం. కాదంటే పోరాటాలు ఉధృతం కాక తప్పదు. అది అంతిమంగా పాలకుల పీఠానికే ముప్పు వస్తుందన్నది చరిత్ర చెబుతున్న సత్యం.
రాష్ట్రంలో 66 రంగాల్లో సుమారు 50 లక్షల మందికి పైగా ప్రైవేట్ యాజమాన్యాల కింద పని చేస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ పథకాల అమలులో మరికొన్ని లక్షల మంది వున్నారు. వీరందరికి చట్ట ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా వి.డి.ఎ తో పాటు వేతన ఒప్పందాలు జరగాలి. కానీ మన రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుండి (2012) కనీస వేతనాలు పెంచలేదు. ఈ కాలంలో తెలుగుదేశం, వైసిపి, ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. కాని, వీటికి లక్షలాది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడానికి చేతులు రాలేదు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి బాడుగలు, పిల్లల ఫీజులు, వైద్యం ఖర్చులు, పెట్రోలు, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోతుంటే, కార్మికుల వేతనాలు నత్త నడక కంటే వెనకపడిపోయాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచాల్సిన డి.ఎ పెంచకుండా, వేతనాలను సవరించకుండా కార్మికులను అత్యంత దారుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు పీక్కు తింటున్నాయి. ఈ గత 12 సంవత్సరాల్లో వి.డి.ఎ ను బేసిక్ వేతనంతో కలిపి, కనీసం 15 నుండి 20 శాతం వేతనాలు పెంచి వుంటే నైపుణ్యం లేని కార్మికుడికి సైతం నెలకు రూ. 22,000 వేతనం వచ్చి వుండేది. అది అమలు చేయకపోవడంతో రూ.12-13 వేలకు మించి అందడంలేదు. ఇంత తక్కువ వేతనంతో కార్మికులు ఏమి కొనగలరు ఏమి తినగలరు కార్మికుల వేతనాలు పెరిగితే వారి కొనుగోలు పెరుగుతుంది, తద్వారా పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, పారిశ్రామికీకరణ వేగవంతం అవుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడే రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది.












