జిల్లాలో నిజమైన, నిబద్ధత కలిగిన జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ అభిలాష అభినవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి విలేకరికి కార్డు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) మరియు కమిటీ సభ్యులపై ఉందన్నారు.
అక్రిడిటేషన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాలను కలెక్టర్ వివరించారు. క్రిమినల్ నేపథ్యం ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కార్డులు జారీ చేయరాదని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
నిబంధనలను ఉల్లంఘించి అక్రిడిటేషన్లు పొందే ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. త్వరలోనే జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అర్హులైన జర్నలిస్టులకు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఇ. విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు అల్వాల హనుమంతు, కొండూరి రవీందర్, అల్లం అశోక్, ఆర్. మహేందర్, ఎం.ఏ. వసీం, రామెళ్ళ రాజేశ్వర్, సిరిపురం నాగరాజు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











