లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదని, రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రయత్నం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే అవగాహన ఉన్నప్పటికీ, బీజేపీ కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిందని ఆమె ఆరోపించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లు వీగిపోవడంపై కవిత శుక్రవారం వీడియో సందేశం విడుదల చేశారు. మహిళా కోటా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును ముడిపెట్టడంతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లు వీగిపోయేలా చేశాయని ఆమె తెలిపారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి, పాస్ చేసి దానిని సెన్సెస్కు లింక్ చేశారని కవిత పేర్కొన్నారు. ఇప్పుడు 2011 సెన్సెస్ ఆధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు చెప్పి మరోసారి వంచించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళలు బీజేపీ మోసాన్ని గుర్తించాలని కవిత కోరారు. ఈ చర్యను ఆమె రాజకీయ లబ్ధి కోసం బీజేపీ చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు.












