Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 'జలసిరి' కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట అనే నినాదంతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జలసిరి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, ఇతర అధికారులతో కలిసి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం సాయంత్రం జలసిరి కార్యక్రమం, విబిజి రామ్ జి పనులు, గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట అనే నినాదంతో భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రతి రైతు తమ పొలాలలో ఫామ్ పాండ్ నిర్మించుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా చూడాలని సూచించారు. రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.
విబిజి రామ్ జి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులలో దేశంలోనే ముందువరుసలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కూలీలందరికీ పని దినాలు కల్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జరిగిన ఈ వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఈఈ ఆర్డబ్ల్యుఎస్ సందీప్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











