మిర్యాలగూడ, జూలై 4
రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్), ఎమ్మెల్సీ కె.శంకర్ నాయక్ లతో కలిసి శనివారం దున్నపోతుల గండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, నాణ్యత, వేగం, సాంకేతిక అంశాలపై అధికారులతో సమీక్షించారు.
రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్), ఎమ్మెల్సీ కె.శంకర్ నాయక్ లతో కలిసి శనివారం దున్నపోతుల గండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, చేపట్టిన పనుల నాణ్యత, నిర్మాణ వేగం, సాంకేతిక అంశాలను సమీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, దున్నపోతుల గండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీటి వసతి మరింత మెరుగుపడటంతో పాటు రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నీటి వనరుల సమర్థ వినియోగంతో వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ప్రాంత రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.











