హైదరాబాద్, జులై 24
రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి కఠిన నిబంధనలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో డ్రగ్స్ నిరోధం, భద్రత కమిటీలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ఉన్నతాధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.
విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆయా సంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు. క్యాంపస్ లోపల డ్రగ్స్‌కు సంబంధించి ఏ ఘటనకైనా యాజమాన్యాన్నే బాధ్యులను చేయాలని సూచించారు. డ్రగ్స్ విషయంలో క్యాంపస్ బయట జరిగే యాక్టివిటీని గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
విద్యాసంస్థలకు అధికారంతో పాటు బాధ్యతను అప్పగించాలని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.
గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం.. ఈ మూడు దశలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. డ్రగ్స్ స్వీకరించి పట్టుబడితే డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించాలని అన్నారు. తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ స్పష్టం చేశారు.












