ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు, జేఏసీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాడి రాజు అన్నారు. మిర్యాలగూడలోని బీసీ భవన్లో జరిగిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సబ్బండ వర్గాల సామూహిక ఉద్యమాలతోనే తెలంగాణ సాధించబడిందని, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని, ఆంధ్ర పాలక పక్షాన్ని ధిక్కరించారని డాక్టర్ రాజు పేర్కొన్నారు. ఉద్యమం ఉధృతమవడంతోనే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.
ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులను గుర్తించి, గౌరవించి, సన్మానించుకుంటే ఉద్యమకారులు ఆనందపడతారని, ఇప్పటివరకు అలాంటి గౌరవం వారికి దక్కలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను సన్మానించాలని నిర్ణయించడం అభినందనీయమని ఆయన తెలిపారు.
నిజమైన, నికర్శైన ఉద్యమకారులను గుర్తించాలని డాక్టర్ రాజు సూచించారు. ఈ సమావేశానికి జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేత మాలోత్ దశరథ్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.










