ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్ర ఆవిర్భావం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
మంగళవారం భైంసా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో ఆంధ్ర నాయకుల పాలనలో రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నారని, ఆయన పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కాగా, భైంసాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము జాతీయ జెండాను ఆవిష్కరించారు.











