తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గ్రామీణ స్థాయిలో ప్రజల్లో చైతన్యం నింపిన మాజీ సర్పంచ్ మెండే శ్రీధర్ సేవలను స్థానిక ప్రజలు, ఉద్యమ సహచరులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్మరించుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో దీక్షా శిబిరాలు, అవగాహన సదస్సులు, ర్యాలీలు, ధూం-ధామ్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో మెండే శ్రీధర్ చురుకుగా వ్యవహరించారు. ఉద్యమ కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణ కోసం ఆయన బిక్షాటన నిర్వహించి, తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో మరింత బలంగా చాటిచెప్పారు.
ఉద్యమ సహచరులతో కలిసి గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ సంస్కృతి, భాష, ఆత్మగౌరవాన్ని ప్రజలకు చేరవేశారు. యువతలో ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు ఇంటర్ విద్యార్థుల బస్సు ప్రయాణ, భోజన ఖర్చులను సైతం తన సొంత నిధులతో భరించారు.
అలాగే ఉద్యమ అధినేత కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలకు భారీ స్థాయిలో జనసమీకరణ చేపట్టి తెలంగాణ ఉద్యమ విజయానికి తన వంతు సహకారం అందించారు. ప్రజలను ఏకం చేస్తూ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం, ఉద్యమంలో పోషించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2015లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అప్పటి మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా మెండే శ్రీధర్ 'ఉత్తమ ఉద్యమ నేత'గా అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆయన చేసిన ఉద్యమ సేవలను పలువురు కొనియాడారు.











