తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్ పల్లి మండలం, విలాసాగర్ గ్రామంలో నిర్మించిన 31 గృహాలకు ఆదివారం గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. మొత్తం 72 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో మొదటి దశగా 31 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు.
విలాసాగర్ గ్రామంలో ఇల్లు లేని పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే లక్ష్యంతో ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. గ్రామానికి మొత్తం 72 ఇళ్లు మంజూరు చేయడంలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఆయన కృషికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆదివారం జరిగిన గృహప్రవేశాల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ–రాజు, పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి జనగం శేఖర్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా, ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పేదల సొంతింటి కలను నిజం చేయడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.












