ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలపై నిర్మల్ పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ మాట్లాడుతూ, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించడంతో నిర్మల్ పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ మాట్లాడుతూ, బీజేపీపై ప్రజలకు ఉన్న నమ్మకం మరోసారి నిరూపితమైందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై ప్రజల విశ్వాసం స్పష్టంగా బయటపడిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్, తమిళనాడులో హిందూ సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన ముఖ్యమంత్రులను అక్కడి ప్రజలు అధికారం నుంచి దించారని ఆయన పేర్కొన్నారు.
అన్ని పార్టీలు ఏకమైనా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయాయని ఎద్దేవా చేసిన రాంనాథ్, కేరళ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని తెలిపారు. ఇకపై తెలంగాణ రాష్ట్రం తమ లక్ష్యమని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ఈనెల 10న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఈ విజయాలు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని రాంనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, ముత్యం రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు సాదాం అరవింద్, శ్రీరామోజు నరేష్, గంజి రాజు, కూన శశాంక్, జింక సూరి, ఖమ్మం సురేందర్, సూరజ్ నాయక్, ముత్యం, బీజేపీ నాయకులు అనిల్, వెంకటేష్, రాము తో పాటు తదితరులు పాల్గొన్నారు.








