తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల ఆశయాలు బహుజన తెలంగాణలోనే నెరవేరుతాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కేవలం ప్రజల త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ఫలితంగా సాధించుకున్న ప్రజల రాష్ట్రమని, ఇది ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఏర్పడినది కాదని జగన్ మోహన్ పేర్కొన్నారు. అమరవీరులకు బీఎస్పీ తరఫున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీఎస్పీ అధినేత్రి బహెన్ కుమారి మాయావతి నాయకత్వంలో బీఎస్పీకి చెందిన 39 మంది ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమనే భావనతో పాటు బహుజనులకు రాజకీయ అధికారం, సామాజిక న్యాయం సాధించాలనే అంబేద్కర్ సిద్ధాంతానికి బీఎస్పీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఉద్యమ ఆకాంక్షలైన సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బహుజన అభివృద్ధి పూర్తిస్థాయిలో నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాలు మారినా బహుజనుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు.
“తెలంగాణ కోసం అమరవీరులు కలలు కన్నది కొందరి పాలన కోసం కాదు… బహుజనుల రాజ్యాధికారం కోసం. ఆ ఆశయాలను సాకారం చేసే శక్తి బీఎస్పీ మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, చెరుకు రాజ్యం, లక్ష్మీ యాదవ్, కాటం ప్రభాకర్, జోసెఫ్ గంగారాం, ముత్యం, సాయన్న తదితర నాయకులు పాల్గొన్నారు.












