డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, ఎల్లమ్మ గుట్ట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షత వహించారు. ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అంటరానితనం నిర్మూలనకు జీవితాంతం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. సమాజంలో ఉన్న వివక్ష, అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి అపారమని తెలిపారు.
అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, బలహీన వర్గాల అభ్యున్నతికి బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. అంటరానితనం వంటి సామాజిక వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఆయన చూపిన దారిలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.








