మిర్యాలగూడలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేయనున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ పట్టణ శివారులోని శ్రీనివాస్ నగర్, గుమస్తాల కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 2 నాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులతో అన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు.
ఇళ్ల పంపిణీకి ముందు సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, తాగునీటి ట్యాపులు, విద్యుత్ సౌకర్యాలు, కిటికీలకు గ్లాసులు, బాత్రూములు, ట్రాన్స్ఫార్మర్, స్ట్రీట్ లైట్లు వంటి అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పార్కులు, వాటర్ ప్లాంట్లు, గదుల శుభ్రత, సానిటేషన్, మొక్కల నాటడం, మిషన్ భగీరథ నీటి సరఫరా, డ్రైనేజీలు, పెయింటింగ్ పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు.
గుంతల రోడ్ల మరమ్మతులు, మంచినీటి లైన్ల పూర్తి, తాగునీటి ట్యాంకుల శుభ్రత, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్, విద్యుత్, ఫ్యాన్, బోర్డుల పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పనులన్నీ ఈ నెల 30వ తేదీలోగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.











