జనగణన ప్రక్రియలో ప్రజలందరూ చురుగ్గా పాల్గొని, అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జనగణన ప్రచార వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా జిల్లా ప్రజలకు జనగణన ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో సుమారు 20 వేల మంది ప్రజలు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను స్వయంగా పూర్తి చేసుకున్నారని, నేటి నుంచి జూన్ 9వ తేదీ వరకు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ దశలో అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు.
జనగణన నిర్వహణ కోసం జిల్లాలో సుమారు 1,400 మంది ఎన్యుమరేటర్లు, 200 మందికి పైగా సూపర్వైజర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఎన్యుమరేటర్లు అడిగే 33 ప్రశ్నలకు ప్రజలు సరైన సమాచారం అందించి సహకరించాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఈసారి జనగణన ప్రక్రియ మొత్తం కాగిత రహితంగా, పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని, హౌస్ లిస్టింగ్ అనంతరం రెండో దశ జనగణన చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండలం, పట్టణ వార్డుల్లో ప్రత్యేక ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
జిల్లాలో సుమారు 2 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించనున్నట్లు, ఒక్కో ఇంటి వివరాల నమోదుకు 3-4 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, సీపీఓ జీవరత్నం, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.












