నిర్మల్, జూలై 4
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 70వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ కలెక్టరేట్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 70వ వర్ధంతి సందర్భంగా శనివారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడారని గుర్తుచేశారు.
ఇలాంటి మహనీయుల జయంతులు, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం వారి త్యాగాలకు ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.












