భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు మాత్రమే కాదు, సమానత్వానికి ప్రతీక, న్యాయానికి ప్రతినిధి, సామాజిక మార్పుకు మార్గదర్శి అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. నిర్మల్ పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్, గొల్లపెట్ కాలనీలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరిరావు, గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, "సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలి. కుల, మత, భేదభావాలు లేకుండా అందరూ సమానంగా ఎదగాలని ఆయన రచించిన భారత రాజ్యాంగం మన దేశానికి ఎంతో బలమైన పునాది. ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి" అని తెలిపారు.
అనంతరం స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. "నేటి యువత చెడు మార్గాలు, దురలవాట్లకు ఆకర్షితులు కాకుండా అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, చదువు ద్వారా ఎదిగి సమాజానికి సేవ చేయాలి. మన హక్కులను కాపాడుకోవడం మాత్రమే కాదు, ఇతరుల హక్కులను కూడా గౌరవించాలి" అని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గొల్లపెట్ అంబేద్కర్ సంఘ నాయకులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.








