నిర్మల్ జిల్లా, ముధోల్ మండలం, అష్ట గ్రామానికి చెందిన యువ క్రికెటర్ గైని నందు ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం లేదని, అతనికి అన్యాయం జరుగుతోందని జమాతే ఉలమా హింద్ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఓవైసీ పేర్కొన్నారు.
సయ్యద్ ఓవైసీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన గైని నందు క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పటికీ, జోనల్ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచినప్పటికీ, జిల్లాస్థాయి జట్టులో అతనికి స్థానం దక్కలేదని తెలిపారు. ఇది తీవ్ర దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రస్థాయి మ్యాచ్లలో మెదక్, అదిలాబాద్ జిల్లాల తరఫున ఆడినా, సరైన అవకాశాలు లభించలేదని, ఈ విషయమై ఆయన విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా గైని నందుకు తగిన స్థానం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మారుమూల గ్రామాల నుంచి వస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గైని నందు వంటి ప్రతిభావంతులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే అది దేశానికి గర్వకారణంగా ఉంటుందని ఆయన అన్నారు.
అంతర్జాతీయ క్రీడా సెలక్షన్ కమిటీలు, రాష్ట్ర క్రీడా సంఘాలు పల్లె ప్రాంతాల నుంచి వస్తున్న యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించాలని సయ్యద్ ఓవైసీ కోరారు.








