అమరావతి, 2026-08-21
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేస్తోంది. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్లోని కోకాపేట, పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసాలతో పాటు ఆయన కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలపై ఆరా
ప్రధానంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, అవినాష్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లలోనూ తనిఖీలు
ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రమే కాకుండా, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పులివెందులలోని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం
తొండూరు మండలం, టి. తుమ్మలపల్లిలోని ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక పులివెందులలోని వైఎస్ జగన్ సమీప బంధువైన సునీల్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












