విజయనగరం, 2026-08-21
దేశవ్యాప్తంగా యువత చేపడుతున్న పోరాటాలు విజయవంతం అవుతున్నాయని, ప్రభుత్వాలు వారి డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తోందని మాజీ ఎంపీ, విజయనగరం డా. డి.వి.జి. శంకరరావు అన్నారు. జంతర్ మంతర్ వద్ద జెన్ జి యువత నిరసనలతో కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాల్సి రావడం, రాంచీలో యువత పోరాటంతో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామకాలను రద్దు చేయాల్సి రావడం యువత సాధించిన విజయాలని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా యువత చేపడుతున్న పోరాటాలు విజయవంతం అవుతున్నాయని, ప్రభుత్వాలు వారి డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తోందని మాజీ ఎంపీ, విజయనగరం డా. డి.వి.జి. శంకరరావు అన్నారు. జంతర్ మంతర్ వద్ద జెన్ జి యువత నిరసనలతో కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాల్సి రావడం, రాంచీలో యువత పోరాటంతో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామకాలను రద్దు చేయాల్సి రావడం యువత సాధించిన విజయాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పక్షాల ఏలుబడిలో ఉన్నప్పటికీ, యువత ముందు మెడలు వంచాల్సి రావడం గమనార్హమని తెలిపారు.
యువత ఆందోళనకు కారణాలు
అయినప్పటికీ, యువతకు జరగాల్సిన న్యాయం ఇంకా మిగిలే ఉందని, అవకాశాలు తగ్గుతున్నాయని, నాణ్యమైన విద్య ఖరీదైనదిగా మారిందని డా. శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు విస్తృతి, అంతర్జాతీయ పరిణామాలు వారిలో భవిష్యత్తు పట్ల ఆందోళనను పెంచుతున్నాయని అన్నారు. ఉన్న కొద్ది అవకాశాలు కూడా ప్రభుత్వ నిర్వహణలోని అసమర్ధత, అవినీతి వల్ల దూరం కావడం తట్టుకోలేని అన్యాయంగా తయారవుతోందని, ఈ నేపథ్యంలోనే యువత పోరాట బాట పట్టాల్సి వస్తుందని వివరించారు.
ప్రభుత్వాల వైఖరిపై విమర్శ
తమ ఆవేదన, ఫిర్యాదులోని నిజాయితీని గమనించకుండా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించడం యువతకు పుండుమీద కారం జల్లినట్లు అనిపిస్తుందని, అందుకనే వారు తెగించి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వివాదాలకు మూలమైన పరీక్షా విధానాన్ని సమూలంగా సంస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జార్ఖండ్ లో 2024 నుండి వివాదాస్పదమైన ఉద్యోగ నియామకాలను రద్దు చేయడం మంచి పరిణామమే అయినప్పటికీ, కోర్టు తీర్పు ద్వారా ఇప్పటికే ఉద్యోగాలు పొందిన 2 వేల మంది భవిష్యత్ డోలాయమానంలో పడిందని, ప్రభుత్వం చేసిన తప్పుకు వారంతా బలికాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
పారదర్శక విధానాలు అవసరం
ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వాలు పారదర్శక విధానాన్ని, సమర్ధవంతమైన నిర్వహణా వ్యవస్థను ఏర్పరుచుకోవాలని డా. శంకరరావు సూచించారు. ఇది ప్రభుత్వాల కనీస బాధ్యత అని అన్నారు. యువత అధికంగా ఉన్న దేశం మనది కాబట్టి, వారి శక్తియుక్తులను గుర్తించి సంపూర్ణంగా వాడుకోవడంలోనే విజయ రహస్యం దాగి ఉందని ఆయన ఉద్ఘాటించారు.












