మిర్యాలగూడ, జూలై 21
మిర్యాలగూడలో బీఆర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై యువజన కాంగ్రెస్ నాయకులు మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ చంద్రిక సూచనల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ అజహరుద్దీన్ ఆధ్వర్యంలో టూ టౌన్ మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఎల్బీనగర్ లో నిర్వహించిన యువ సదస్సులో తెలంగాణ రాష్ట్ర సీఎం అనుముల రేవంత్ రెడ్డి, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, వారితో అలా మాట్లాడిస్తున్న సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కలిసి ఫిర్యాదులో కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సతీష్ నాయుడు, పట్టణ ఉపాధ్యక్షులు గడగోజు అశోక్ చారి, ప్రధాన కార్యదర్శి జాస్తి అమర్ చౌదరి, మిర్యాలగూడ మండల అధ్యక్షుడు పొట్టేపాక వినయ్, వేములపల్లి మండల ఉపాధ్యక్షులు చంటి, ఇమ్రాన్, హరి, కరీం, నుమాన్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.











