ఢిల్లీ / చీరాల, ఆగస్టు 05, 2026
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత సాధించిన విజయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ నిరంకుశ పాలన అంతానికి ఇది ఆరంభాన్ని సూచిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పేర్కొన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత సాధించిన విజయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ నిరంకుశ పాలన అంతానికి ఇది ఆరంభాన్ని సూచిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పేర్కొన్నారు.
మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీసి, సీజేపీ ఆవిర్భావానికి కారణమయ్యాయని ఆయన తెలిపారు. మొదట ఆన్లైన్లో వ్యక్తమైన ఆగ్రహం, నీట్ పేపర్ లీక్ కావడం, దాని పర్యవసానంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో వీధుల్లోకి వెల్లువెత్తిందని వివరించారు.
ఈ నిరసనను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, వేలాదిగా చేరుకున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడిందని బేబీ ఆరోపించారు. పాలకులే హింసను ప్రేరేపించినప్పటికీ కేసులు మాత్రం నిరసనకారులపై బనాయించారని, అయినా వెరవకుండా నిరసనకారులు మరుసటి రోజే మళ్లీ భారీ సంఖ్యలో తిరిగొచ్చారని తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రయాణాలపై ఆంక్షలు, మెట్రో స్టేషన్లను మూసివేసినా, జంతర్ మంతర్ వద్ద గుమిగూడారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయని, నిరసనకారులకు వైద్య, న్యాయ సహాయం లభించిందని తెలిపారు. బాధ్యతాయుత పౌరులు, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీటిని అందజేశాయని, ఎస్.ఎఫ్.ఐ, ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎ.ఐ.ఎస్.ఎ విద్యార్థి సంఘాలు దేశ నలు మూలల నుండి ఉద్యమానికి మద్దతును సమీకరించాయని వివరించారు. సీజేపీ ఆన్లైన్ ప్రచారాల ద్వారా సాధారణ ప్రజల్లో విస్తృత మద్దతు కూడగట్టిందని తెలిపారు.
ఈ ఉద్యమాలు, ప్రజల సమూహం కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్ల పైకి తెచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకురావడంలో సఫలమయ్యాయని బేబీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ విద్యా రంగంలో భారీ అవినీతి, నాసిరకం నిర్వహణకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడటానికి మొదట శాయశక్తులా ప్రయత్నించారని గుర్తుచేశారు. ఈ విజయం నేడు భారతదేశాన్ని పాలిస్తున్న నిరంకుశ కార్పొరేట్-మతతత్వ కూటమిని ఓడించవచ్చనే నమ్మకాన్ని, ఆశను ప్రజాస్వామ్య, లౌకికవాదులందరిలో చిగురింపచేసిందని తెలిపారు.
జాతీయ విద్యా విధానం (ఎన్.ఇ.పి) 2020ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, విద్య కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ అనే ముప్పేట దాడికి ఆ విధానమే మూల కారణమని పేర్కొన్నారు. ఇది విద్యా రంగంలో తీవ్ర అవినీతికి, నిర్వహణా లోపాలకు దారితీస్తోందని, అందుకే విద్యా సంస్కరణల కోసం ఎస్.ఎఫ్.ఐ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిందని తెలిపారు. బీహార్‌లోని నలందలో నిరసనకు నాయకత్వం వహించిన ఎస్.ఎఫ్.ఐ బీహార్ రాష్ట్ర అధ్యక్షురాలు కాంతి కుమారి, ఆమె సహచరులు జైలులోనే ఉన్నారని, కాబట్టి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసిన ఈ ఉద్యమంలో ఎస్.ఎఫ్.ఐ భాగస్వామ్యం కావడం సహజమని అన్నారు.












