Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు, ఇటీవల భారీ వర్షాలకు ఇల్లు కోల్పోయిన మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడేనికి చెందిన సీడం గంగుబాయిని పరామర్శించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతానికి ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లి, ఆమెకు భరోసా ఇచ్చారు.
మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం కాలినడకన గూడెంకు చేరుకుని బాధితురాలిని పరామర్శించారు.
వాహనాలు వెళ్లలేని ఈ గూడెంకు చేరుకోవడానికి మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లిన శ్రీహరి రావు, గంగుబాయికి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గూడెంలో త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
శ్రీహరి రావు తమ గూడెంకు స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడంతో గిరిజనులు భావోద్వేగానికి గురయ్యారు. 'ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు రాలేదు. ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన తొలి నాయకుడు మీరే' అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తోటిగూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్‌పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్‌రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జైసింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.











