భారతదేశ ఆధునిక, సాంకేతిక విప్లవానికి మార్గదర్శకుడిగా నిలిచిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకుని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆయన సేవలను స్మరించుకున్నారు.
గురువారం మిర్యాలగూడలో జరిగిన ఈ స్మారక కార్యక్రమంలో, ఎమ్మెల్యే బిఎల్ఆర్ తో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ భవన్, రాజీవ్ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, దేశంలో నేడు మనం అనుభవిస్తున్న కంప్యూటర్, టెలికాం రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ దూరదృష్టినే కారణమని తెలిపారు.
యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో, ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన గొప్ప నాయకుడిగా రాజీవ్ గాంధీని ఆయన అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పిసిసి డెలికేట్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








