బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
బైంసాలో ఎస్.ఐ.ఆర్. (సర్) ప్రక్రియపై బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, గ్రామాల వారీగా అందరి ఓట్లను నమోదు చేయాలని ఆయన సూచించారు. విదేశీయుల చొరబాటును అరికట్టడానికి, బోగస్ ఓట్లను తొలగించడానికి ఇది మంచి అవకాశమని తెలిపారు.
ఎస్.ఐ.ఆర్. (సర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, గ్రామాల వారీగా అందరి ఓట్లను నమోదు చేయించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. గురువారం బైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సర్ ప్రక్రియపై బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విదేశీయులు దేశంలో చొరబడకుండా నిరోధించడానికి సర్ ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుందని, బోగస్ ఓట్ల తొలగింపునకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్.ఐ.ఆర్.లో గ్రామాల వారీగా బీఎల్వోలకు బీజేపీ బీఎల్ఏలు సహకరించాలని ఆయన సూచించారు.
భైంసా తో పాటు కుబీర్, ముధోల్, తానుర్, బాసర మండల కేంద్రాల్లో పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు ఉన్నాయని, ఎస్.ఐ.ఆర్.తో అవన్నీ తేటతెల్లమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఏవైనా అనుమానాలుంటే అధికారులను సంప్రదించాలని, అర్హులైన వారి ఓటును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితిష్ రాథోడ్ మాట్లాడుతూ, సర్ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్ ద్వారా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల బోగస్ ఓట్లు తొలగించబడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు ఉన్నాయని, దేశం కోసం, ధర్మం కోసం నాయకులు, కార్యకర్తలు అంతా కంకణ బద్ధులై సర్ కు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్.ఐ.ఆర్. జిల్లా ఇంచార్జి రావుల రాంనాథ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, ముధోల్ నియోజకవర్గ బీజేపీ సర్ ఇంచార్జ్ పైడిపల్లి గంగాధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, ఏనుపోతుల మల్లేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము, బీజేపీ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.











