కరీంనగర్, 2026-06-05
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు కనీస అవగాహన లేదని, వారు అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు కనీస అవగాహన లేదని, వారు అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2 పంప్ హౌస్ లను సందర్శించిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పంప్ హౌస్ ల సందర్శన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2 పరిధిలోని పంప్ హౌస్ ల సందర్శన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకత్వం నిర్వహించింది. ఈ సందర్శనలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న వారికి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుండి నందిమేడారంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరోవ ప్యాకేజి డెలివరీ సిస్టం ను సందర్శించారు. ఎల్లంపల్లి నుండి నంది పంప్ హౌస్ కు వస్తున్న గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు.
గాయత్రీ పంప్ హౌస్ పరిశీలన
అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రీ పంప్ హౌస్ కు చేరుకొని, డెలివరీ సిస్టం వద్ద నుండి వస్తున్న జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడ ఉన్న గుడి మాత్రమే అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణ
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ, కేసీఆర్ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికే కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్, కనీస అవగాహన లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రాజెక్టుపై సరైన అవగాహన లేనివారు మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.










