కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర భారం మోపుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ముధోల్ ఇంచార్జి విలాస్ గాదేవార్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం బైంసా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటలకు సరైన కొనుగోలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచుల కొరతతో పాటు రైతుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సవతి తల్లి ప్రేమలా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రైతులకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ పాలనలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితులపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విలాస్ గాదేవార్ వ్యాఖ్యానించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








