బైంసా మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికను వాయిదా వేయాలనే జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక దీక్ష చేస్తున్న కౌన్సిలర్లకు ఆయన సంఘీభావం తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, ఎన్నిక వాయిదా నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కలెక్టర్ అనుమతితో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని ముందుగా తెలియజేసి, ఆ తర్వాత రాత్రికి రాత్రే వాట్సాప్ సందేశం ద్వారా ఎన్నికను రద్దు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ఎన్నిక వాయిదాకు గల కారణాలను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.
అధికారులు ఎంఐఎం, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని, ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పటేల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, అధికారులపై ఫిర్యాదు చేయడంతో పాటు, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని, అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు.
ఎన్నికలు సజావుగా జరిగే వరకు కౌన్సిలర్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పాలకవర్గం ఏర్పడి రెండేళ్లు మాత్రమే అయిందని, ఎంఐఎం పార్టీ అధికార దాహంతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. బంద్ కు మద్దతు తెలిపిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.












