తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇచ్చోడాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ప్రస్తావన లేదని, రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీ, పింఛన్లు, ఉద్యోగాల నోటిఫికేషన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించిందని బీఆర్ఎస్ నాయకులు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు గడిచినా ఈ హామీలు అమలు కాలేదని విమర్శించారు.
రైతు భరోసాను ఒక ఎకరానికే పరిమితం చేయడం, రుణమాఫీ సగం మందికే జరగడం వంటి చర్యలతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీల అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.
ప్రతి రైతుకు పాత విధానంలో ఉన్న ఎకరాలన్నింటికీ తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీల అమలు జరగకపోతే గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, మాజీ సర్పంచ్ పాండురంగ్, మహేందర్, సాబీర్, నర్వాడే రమేష్, గణేష్, మహేష్, భీముడు, అడేళ్లు తదితర నాయకులు పాల్గొన్నారు.











