సారంగాపూర్ మండలం యాకర్‌పల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సారంగాపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామంలో కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయని, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
యాకర్‌పల్లి గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, దాదాపు 40 లారీల దిగుబడి వస్తుందని అంచనా. గ్రామ సర్పంచ్ వడ్లకొండ దివ్య నవీన్ ఆధ్వర్యంలో రైతులు ఈ వినతిని జిల్లా కలెక్టర్‌కు అందించారు.
గ్రామంలో ఉపకేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉందని, షెడ్, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించడానికి గ్రామపంచాయతీ సిద్ధంగా ఉందని సర్పంచ్ తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ మద్దతు ధరకు పంట కొనుగోలు చేసేలా యాకర్పల్లిలోనే కొనుగోలు ఉపకేంద్రం మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











