నల్గొండ, 2026-08-20
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యోదంతం, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలోని సంక్షోభాన్ని మరోసారి ఎత్తిచూపింది. విద్యార్థుల నేర ప్రవృత్తి, గురుశిష్యుల సంబంధాలలో వస్తున్న మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తాయి. రాయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ, అవి సమాజంలోని అంతర్గత సంక్షోభాన్ని, పతనాన్ని సూచిస్తాయి. భారతీయ సమాజంలో గురువుకు ఎంతో గౌరవం ఉంది. గురుశిష్యుల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతలతో విలసిల్లిన ఈ నేలపై ఇటీవల జరుగుతున్న సంఘటనలు, ప్రపంచీకరణ ప్రభావంతో వస్తున్న మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. విద్య, విలువలు, నైతికత, సామాజిక పతనం.. ఇవన్నీ సమాజం మన ముందుంచిన బాధ్యతాయుతమైన ప్రశ్నలు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యోదంతం ఒక తాజా ఉదాహరణ. ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో పదవ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులే ఆమెను అత్యంత కిరాతకంగా 27 కత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. దేశవ్యాప్తంగా గురువులపై అఘాయిత్యాలు, అవమానపరిచే ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. కారణాలు ఏవైనా విద్య వ్యాపారీకరణ, ప్రపంచీకరణ దుష్ఫలితాలు ఎంతో ఆందోళనను కలిగిస్తున్నాయి. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన మంచి వాతావరణం, ఇలా అగౌరవంగా, ఆగ్రహంగా, ఘర్షణలు, హింస నెలకొనడం దిగజారిన సామాజిక స్థితిగతులను తెలుపుతోంది.
నిందితుల నేర ప్రవృత్తి
దురలవాట్లకు బానిసలైన ఇద్దరు విద్యార్థులను మంచిగా ఉండాలని మందలించినందుకు ప్రిన్సిపల్‌పై కక్ష కట్టారు. ఆమెను దారుణంగా చంపి, ఆమె ఇంట్లో ఉన్న డబ్బులు దోచుకెళ్లి, జల్సాలకు ఖర్చు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఈ ఇద్దరు విద్యార్థులు మద్యం, గంజాయికి అలవాటు పడ్డారు. యూట్యూబ్‌లోని వీడియోలు చూస్తూ, తప్పుడు మార్గాలలో డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు. నిందితులు ఇద్దరూ చిన్న వయసులోనే పక్కా ప్లాన్‌తో హత్య చేయడం, అంత చిన్న వయసులోనే ఇంత నేర ప్రవృత్తి కలిగి ఉండటం చూస్తుంటే పిల్లల పెంపకం, విద్యా విధానంలోని డొల్లతనం, మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలలో ఇంత రాక్షస ప్రవృత్తికి గల కారణాలు చూస్తే, విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, చదువు అంటే మార్కులు, ర్యాంకులు, ఫీజులు, ఫలితాలు అనే వాణిజ్య అంశాలకే ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎటువంటి సౌకర్యాలు లేకుండా, పుట్టగొడుగుల్లా గల్లీకి ఒక పాఠశాల వెలిసింది. ఇక్కడ వ్యాపార సంబంధాలే గానీ, మానవీయ సంబంధాలు ఉండవు. నేడు చదువు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి సైన్స్ సబ్జెక్టులు తప్ప సామాజిక శాస్త్రాలకు తావులేదు. అందుకే యంత్ర మనుషులు తయారవుతున్నారు. సోషల్ సైంటిస్టులు తయారు కావడం లేదు.
సాంఘిక, మానసిక ప్రభావాలు
ఈ అంతరం రానురాను పెరిగిపోతోంది. దీని కారణంగా మొత్తం సమాజం యాంత్రికరణ చెంది, పిల్లలు పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదివి, డబ్బులు సంపాదిస్తున్నా, జీవితం, సమాజం విసిరే సవాళ్లను, సమస్యలను అర్థం చేసుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. చావే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. దీనికి జ్ఞానం లోపించిన చదువులు కూడా ఒక కారణం. అలాగే సామాజికంగా చూస్తే ఇంత హింస ప్రవృత్తికి కారణం సినిమాలు, టీవీలు, వెబ్ సిరీస్, సోషల్ మీడియా పిల్లలను బలంగా చెడు వైపు ప్రభావితం చేస్తున్నాయి. మద్యం, జూదం, గంజాయి ఇతర చెడు అలవాట్లను సమాజం ప్రోత్సహించేదిగా ఉంది. ఈ అలవాట్లు సాధారణ జీవన శైలిలో భాగంగా మారిపోయాయి. జూదం, మాదక ద్రవ్యాల విషయంలో విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో బాధ్యతగా పనిచేస్తూ, పిల్లలను అవగాహన కల్పించాలి. విద్యార్థులలో చదువులో పోటీ బాగా పెరిగింది. కుండకు చిల్లి పెట్టి నీరు నింపండి అన్న చందంగా చదువులు ఉన్నాయి. ఆడుతూ, పాడుతూ గడపాల్సిన బాల్యం నిత్యం ఒక పరుగు పందెంగా మారింది. దీంతో పిల్లల్లో కోపం, అసహనం, భయం, బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.












