వరి పంట పాలుపోసుకునే దశలో ఉండగా, పలు ప్రాంతాల్లో మొగి పురుగు, కంకినల్లి, మెడ విరుపు, దోమపోటు వంటి చీడపీడలు, తెగుళ్ల బెడదతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని నివారించడానికి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
ప్రస్తుతం వరి పొలాల్లో మొగి పురుగు, కంకినల్లి ఉధృతి ఎక్కువగా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో మెడ విరుపు, దోమపోటు వంటి తెగుళ్లు కూడా సోకే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి.
కంకినల్లి సోకిన వరి పైర్లలో ఆకుల తొడిమలపై గోధుమ రంగు గీతలు కనిపిస్తాయి. ఈ పురుగులు ఆశించిన కంకులలోని గింజలు నల్లబడి, తాలుగా మారిపోతాయి. కంకి ఏర్పడే దశలో స్పైరోమెసిఫెన్ లేదా డయాఫెన్ ధయూరన్ 50 వంటి మందులను పిచికారీ చేయడం ద్వారా కంకినల్లిని నివారించవచ్చని అధికారులు తెలిపారు.
మొగి పురుగు వరి కాండం మొదట్లోకి చొరబడి గుజ్జును తింటుంది. దీంతో వరి కంకి తెల్లబడి తాలుగా మారుతుంది. ఈ పురుగు వల్ల 30 నుంచి 40 శాతం వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంది. మొగి పురుగు నివారణకు కాంటాఫ్ హైడ్రో క్లోరైడ్ 50సి మందును పిచికారీ చేయాలని, వేపనూనెను కలిపి వాడితే మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు.
మెడ విరుపు తెగులు వరి కంకి పాలుపోసుకునే దశలో కంకి వెన్ను దగ్గర నల్లని శిలీంధ్రం ఏర్పడటం వల్ల సంభవిస్తుంది. ఇది భారీ పంట నష్టానికి దారితీస్తుంది. ఈ తెగులు నివారణకు కాసుగామైసిన్ మందును పిచికారీ చేసుకోవాలని అధికారులు సూచించారు. దోమపోటును వరి కాండం మొదట్లో ఉండే రసం పీల్చే పురుగుల ద్వారా గుర్తించవచ్చు. దీని నివారణకు పైమెట్రోజిన్ 50 శాతం మందును పిచికారీ చేసుకోవాలి.











