హైదరాబాద్, జూలై 8
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ అమరుల స్మారక భవనంలో జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొని ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి గుర్తింపు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ అమరుల స్మారక భవనంలో నిర్వహించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రూపొందించాల్సిన నియమ నిబంధనలు, సూచనలు, సలహాలపై కమిటీ సభ్యులు అభిప్రాయాలు సేకరించారు.
ఈ సమావేశానికి కమిటీ సభ్యులు కె. కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, శోభన్ రెడ్డి హాజరయ్యారు. జేఎన్టీయూహెచ్ తరఫున డా. కరుణాకర్ రెడ్డి, ఎరవెల్లి జగన్, అశోక్ గౌడ్, అప్పల శ్రీకాంత్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యమకారులకు సరైన గుర్తింపు కల్పించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.
సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలను పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.












