మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఈ రెండు రాష్ట్రాలపై స్పష్టంగా ఉందని, రాబోయే రెండు రోజుల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు పేర్కొంది.
దీని కారణంగా తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, అదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
అల్పపీడనం ప్రభావంతో నేడు అల్లురి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, పల్నాడు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.












