హైదరాబాద్, జూన్ 29
తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలోని నాగర్ కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, రైతులు ఉరుములు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో సోమవారం ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుండి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.












