కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గంగాధర మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుంకె రవిశంకర్ మాట్లాడారు. మైనర్ బాలిక ఫిర్యాదు వంటి సున్నితమైన అంశంలో ప్రభుత్వం, పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆయన కోరారు.
కేసు నమోదైనప్పటికీ బండి భగీరథ్ ఇంకా ఎందుకు అరెస్టు కాలేదని, చట్టం సామాన్యులకేనా అని ఆయన ప్రశ్నించారు. సామాన్యులకు ఒకలా, అధికార పార్టీలకు మరోలా చట్టం అమలవుతుందని ఆరోపించారు.
తెలంగాణకు అమ్మనవుతానని చెప్పిన కల్వకుంట్ల కవిత ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. బాధిత బాలికకు అన్యాయం చేయాలని మధ్యవర్తిత్వం వహించిన సంగప్పపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రత గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇలాంటి కీలక వ్యవహారాల్లో ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీ 'బేటీ బచావో' నినాదాన్ని నిజం చేయాలంటే బండి సంజయ్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లు పక్కనపెట్టి బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని అన్నారు.












