కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్ పై పోక్సో కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ లో సోమవారం ఆయన ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మైనర్ బాలికపై గత 5-6 నెలలుగా లైంగిక దాడులు, అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారనే ఆరోపణలను విఠల్ రావు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు.
చట్టాలు అందరికీ సమానంగా అమలు కావాలని, ఉన్నవారికి ఒక న్యాయం, లేనివారికి మరో న్యాయం ఉండకూడదని విఠల్ రావు కోరారు. బండి భగీరత్ తన తండ్రి హోదాను అహంకారంతో ఉపయోగించుకుని, మైనర్ బాలికను నమ్మించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి అఘాయిత్యాలకు పాల్పడినట్లు సమాచారం అందిందని ఆయన తెలిపారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోక్సో కేసుల్లో ఇరుకున్న వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలను పటిష్టంగా అమలు చేయించారని, మహిళలు నిర్భయంగా తిరిగే రోజులు ఉండేవని విఠల్ రావు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం లో శాంతిభద్రతలు లోపించాయని, దీనికి ఉదాహరణగా మల్కాజ్ గిరి ఏసీపీ సుమతిపై జరిగిన సంఘటనను ప్రస్తావించారు.
బండి సంజయ్ కుమారుడిపై సమగ్ర విచారణ జరిపి, కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.












