అమరావతి, జూలై 7
శ్రీశైలం ముంపు బాధితుల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. నాలుగు నెలలకు పైగా కొనసాగుతున్న నిరవధిక దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

శ్రీశైలం ముంపు బాధితులు 104 రోజులుగా దీక్ష నిర్వహిస్తూ తమకు ఇచ్చిన హామీల అమలును కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు సానుకూల చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రజల సమస్యలను ఆలకించకుండా కాలయాపన చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
నిర్వాసితుల్లో ఇప్పటికే 32 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని తెలిపారు. మరిన్ని విషాదాలు చోటుచేసుకునేలోపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం లేకుండా పదవీ విరమణతో ఖాళీ అయిన 205 లష్కర్ పోస్టులను నిర్వాసితులతో భర్తీ చేయవచ్చని, అయినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలకు తావిస్తోందని విమర్శించారు. ఈ పోస్టుల భర్తీ ద్వారా అనేక నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు.
ముంపు బాధితులకు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఉపాధి, పునరావాసం, సంక్షేమానికి సంబంధించిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని, శ్రీశైలం ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని మేడా శ్రీనివాస్ స్పష్టం చేశారు.