హైదరాబాద్, జులై 07
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందేలా చూడాలని, నిధులు విడుదల చేసినా ఆలస్యం చేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డిలోని బోధి పెవిలియన్ లో అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, వారి జీతాలు, బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు.
అదే సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పారు.












