శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదానికి ఏడాది దాటింది. 2025, ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘటనలో ఆరుగురు కార్మికుల మృతదేహాలను ఇప్పటికీ వెలికితీయకపోగా, ప్రాజెక్టు పనులు కూడా నిలిచిపోయాయి.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు కృష్ణా జలాలను తరలించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదానికి ఏడాది దాటింది. 2025, ఫిబ్రవరి 21న ఇన్లెట్ సొరంగం 13.93 కి.మీ వద్ద కుప్పకూలిన ఘటనలో సొరంగంలో చిక్కుకుపోయిన ఆరుగురు కార్మికుల మృతదేహాలను ఇప్పటికీ వెలికితీయలేదు. ప్రమాదంతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూడా పునఃప్రారంభం కాలేదు. ప్రభుత్వ సమీక్షలు, నిపుణుల చర్చలు, సర్వేలతోనే కాలం గడుస్తున్నది తప్ప ఒక్క అడుగూ ముందుకు పడిన దాఖలా లేదు.
ప్రమాదానికి క్షేత్రస్థాయి అధ్యయనాలు, సరైన ప్రణాళిక లేకుండానే ప్రభుత్వం హడావుడిగా ముందుకు వెళ్లడమే కారణమని స్పష్టమవుతున్నది. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకోగా, ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. మిగిలిన ఆరుగురి జాడ తెలియలేదు. ప్రభుత్వ పెద్దలు అత్యాధునిక యంత్ర పరికరాలు, నేవీ, రెస్క్యూ దళాలను తెప్పిస్తున్నామని ప్రగల్భాలు పలికినా, 200 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను తొలగించలేని దుస్థితి నెలకొన్నది. ఏడాది గడిచినా మృతదేహాలను గుర్తించలేదు, రెస్క్యూ పనులను నిలిపివేశారు.
ప్రమాదంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) ధ్వంసం కావడంతో పాటు, అవుట్‌లెట్‌లోని టీబీఎం కూడా పనికిరాకుండా పోయింది. కాంట్రాక్టర్ అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ ఒత్తిడితో విడిభాగాలను సరిగ్గా అమర్చకపోవడం వల్ల అవుట్లెట్ వైపు పనులు కూడా ప్రారంభించలేని దుస్థితి నెలకొన్నది. దీంతో ప్రభుత్వం టీబీఎం పద్ధతికే స్వస్తి పలికింది. తాజాగా డీబీఎం పద్ధతిలోనూ అనేక సవాళ్లు ఉన్నాయని ఇంజినీర్లు నిర్ధారిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదం, ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలు, ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) నిర్వహించిన హెలిబోర్న్ మాగ్నటిక్ సర్వే నివేదికలపై గోప్యత కొనసాగుతున్నది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివేదిక అందిందని ప్రకటించినా, అధికారులు మాత్రం తమకు అందలేదని చెబుతున్నారు. సర్వే నివేదికను సంబంధిత విభాగాలకు కాకుండా, ప్రభుత్వ సలహాదారుకు అందించడం ఇరిగేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీబీఎం పద్ధతిలోనూ అనేక సవాళ్లు ఉన్నాయని, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టత లేదని అధికారులు పేర్కొంటున్నారు.


