ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకూడదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన ఆయన, సమస్యల సత్వర పరిష్కారానికి సూచనలు చేశారు.
ప్రజల నుంచి అందిన ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని కలెక్టర్ సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా కృషి చేయాలని ఆయన కోరారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ప్రధానంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి తమ దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ఈ దరఖాస్తులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి అనంతరం 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమానికి సంబంధించి జిల్లా ప్రత్యేక అధికారి సమీక్షా సమావేశానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అలాగే, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంపై అవగాహన కల్పించే గోడ ప్రతులను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, డిఆర్ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












