ముధోల్, జూలై 10
రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు ముధోల్ నియోజకవర్గంలో వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేపట్టిన ఈ బంద్ విజయవంతమైందని సంఘాల నాయకులు తెలిపారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాల (AIPSU, PDSU, SFI, AISB, AISF) ఉమ్మడి పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతమైందని ఆయా సంఘాల నాయకులు తెలిపారు.
నియోజకవర్గ కేంద్రంతో పాటు భైంసా, లోకేశ్వరం, కుంటాల, తానూర్ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడి బంద్‌కు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కూడా నియమించలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓలు, లెక్చరర్లు తదితర పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కఠినమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ప్రభుత్వం తమ 19 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంద్ విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్, PDSU జిల్లా అధ్యక్షుడు వాగ్మారే మహేందర్, AIPSU జిల్లా నాయకులు లంబాడి రాజారామ్, ప్రతాప్, శీతల్కర్ దీపక్‌తో పాటు AIPSU, PDSU, SFI, AISB, AISF సంఘాల జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










