నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోవద్దని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భరోసా ఇచ్చారు.
గొల్లమాడ, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు తమ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొక్కజొన్నను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, అవసరమైన చోట్ల మరిన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులతో పాటు మంత్రికి కూడా సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ఆలస్యం చేస్తే, రైతుల తరపున ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ రాజేందర్, గొల్లమాడ మాజీ సర్పంచ్ చిన్న మహేష్, నాయకులు వినోద్ రెడ్డి, సత్యం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.












