ముధోల్, జూలై 30
ముధోల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా, వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండి ప్రమాదాలను నివారించాలని కోరారు.
ముధోల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ విజ్ఞప్తి చేశారు.
లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా, వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండి ప్రమాదాలను నివారించాలని కోరారు.
పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రాకపోకలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులను అత్యవసరం అయితే తప్ప బయటకు పంపవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల వల్ల ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నా లేదా సహాయం అవసరమైనా నేరుగా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ, అధికారుల సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.











