కోర్టు సముదాయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మిర్యాలగూడ, ఆగస్టు 15 (మనోరంజని తెలుగు టైమ్స్)
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం మిర్యాలగూడ కోర్టు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. 5వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కెవి.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు దేశంలోని చిట్టచివరి వ్యక్తికి అందినప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన సార్థకత చేకూరుతుందన్నారు. ప్రతి పౌరుడికి హక్కులు అందేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని, అందరికీ సమన్యాయం అందించడమే న్యాయస్థానాల ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్డీఓ ఎస్.రమణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతనునిర్వర్తించాలన్నారు.దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో దేశాభివృద్ధికి సహకరించాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి ఎం.అర్జున్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను పరిరక్షిస్తూ సమాజంలో చట్టపాలనను బలోపేతం చేయాలన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిసమన్వయంతో పనిచేయాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.పవన్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత దేశభక్తితో మెలగాలని, విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మారకుండా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దేశభక్తి స్ఫూర్తితో దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలన్నారు. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.లావణ్యరాణి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, సమాన అవకాశాలు అందిస్తున్నారన్నారు. మహిళలు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్య, ఉద్యోగం, పరిపాలన, న్యాయ, రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలన్నారు. యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.అరుణ్ తేజ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. యువత అసాంఘిక శక్తులకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. యువత మంచి మార్గంలో పయనించినప్పుడే స్వాతంత్ర్య స్ఫూర్తికి నిజమైన అర్థం చేకూరుతుందని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో విజేతలకు న్యాయమూర్తులు బహుమతులను ప్రదానం చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఇసరం కరుణాకర్, జనరల్ సెక్రెటరీ జంగిలి ఎల్లయ్య, జాయింట్ సెక్రెటరీ రాయారపు భాస్కర్, ట్రెజరర్ రెడ్డిపల్లి సైదులు, లేడీ రిప్రజెంటివ్ బి.జ్యోతి, లైబ్రరీ సెక్రటరీ కందిమళ్ళ వెంకట్ రెడ్డి, గేమ్స్ సెక్రటరీ భూక్య రమేష్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.












