ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా మే 1న జరుపుకునే మే డే, కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాల చరిత్రను ప్రతిబింబిస్తుంది. 1886 నాటి చికాగో హేమార్కెట్ సంఘటన ఈ దినోత్సవానికి మూల కారణమైంది. అప్పటి నుండి, మే డే కార్మికుల సంక్షేమం, హక్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తోంది.
1886 మే 1న అమెరికాలోని చికాగోలో కార్మికులు 8 గంటల పని దినం డిమాండ్‌తో నిరసన చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత, మే 4న హేమార్కెట్లో జరిగిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారి, పోలీసు కాల్పుల్లో అనేక మంది కార్మికులు మరణించారు. ఈ సంఘటన మే డే పుట్టుకకు దారితీసింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని 1992లో 'చికాగో ల్యాండ్ మార్క్'గా, 1997లో జాతీయ చారిత్రక ల్యాండ్ మార్క్‌గా ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా మే డేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. అమెరికాలో దీనిని లాయల్టీ డేగా వ్యవహరిస్తారు. 1889-1890 మధ్యకాలంలో యూరప్‌తో సహా అనేక దేశాల్లో కార్మిక ఉద్యమాలు ఊపందుకున్నాయి. బ్రిటన్‌లో 1890 మే 1న జరిగిన ప్రదర్శనలో 3 లక్షల మంది కార్మికులు పాల్గొని, 8 గంటల పని దినం డిమాండ్ చేశారు. 1892లో అమెరికా కార్మికుల పని గంటలను 8 గంటలకు కుదిస్తూ చట్టం తెచ్చింది.
20వ శతాబ్దంలో, మే డే యూరప్‌లో ప్రభుత్వ, వ్యాపార దోపిడీకి వ్యతిరేకంగా నిరసనలకు వేదికైంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు, ఆ తర్వాత నాజీ వ్యతిరేక ఉద్యమాలకు కూడా ఈ రోజును ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అనేక యూరోపియన్ దేశాలు మే 1ని సెలవు దినంగా ప్రకటించాయి. ఈ రోజున కార్మికుల సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చాయి. పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసనలు, ఇతర కార్మిక ఉద్యమాలకు మే డే కేంద్ర బిందువైంది.
భారతదేశంలో, 1862లో కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం సమ్మె చేసినా, అది విస్తృత ఉద్యమంగా మారలేదు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడిన తర్వాత, 1923లో భారతదేశంలో మొదటిసారి మే డేను పాటించారు. అప్పటి నుంచి దేశంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం, మే డే సెలవు దినంగా పాటించబడుతోంది. కార్మిక సంఘాలు ఈ రోజున ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తూ, కార్మికుల హక్కులు, మెరుగైన పని పరిస్థితులు, వేతనాల కోసం డిమాండ్ చేస్తున్నాయి.








