భూపాలపల్లి, 05-07-2024
భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపు హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న ఆయన, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టారు. మీకు చేతకాకపోతే కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తారని అన్నారు.
భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపు హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పోలీసుల ఆంక్షలు, అడుగడుగునా ఎదురైన అడ్డంకులను అధిగమించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 8 గంటలకు బయలుదేరిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో 3 గంటల్లో చేరుకోవాల్సిన ప్రయాణానికి మధ్యాహ్నం 3 గంటల సమయం పట్టిందని ఆయన మండిపడ్డారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణకు నీళ్లివ్వాలని కేసీఆర్ మహాయజ్ఞంలా కాళేశ్వరాన్ని నిర్మించారని, తాము ఇక్కడికి ఎవరినో నిందించడానికి లేదా రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు. బాసర నుండి గోదావరి పారుతున్నా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎడారిలానే ఉండిపోయిందని, నీళ్ల కోసమే ఆనాడు ఉద్యమం చేశామని కేటీఆర్ గుర్తుచేశారు.
పల్లం నుంచి నీటిని పైకి తేవచ్చని, మనం కూర్చున్న చోట 90 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నాయని కాళేశ్వరం నిరూపించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు గతంలో తుమ్మిడిహట్టి దగ్గర కడతామని ప్రజలను మభ్యపెట్టారని, ఆనాడు మహారాష్ట్రకు 152 మీటర్ల ఎత్తు పెంచవద్దని కాంగ్రెస్ ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ జలదౌత్యం జరిపి, మూడున్నరేళ్లలో చర్యలు తీసుకుని, గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండేలా కన్నెపల్లి దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారన్నారు.
ఈ భారీ ప్రాజెక్టులో ఒక బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగితే ‘కూలేశ్వరం’ అంటూ కాంగ్రెస్ నేతలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు పిల్లర్లు కుంగిన ఘటనపై తమకు కూడా అనుమానాలున్నాయన్నారు. రెండు పిల్లర్లు కుంగిన బ్లాక్ పునర్నిర్మాణానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే అవుతుందని, అది కూడా ప్రభుత్వంపై ఒక్క పైసా భారం పడకుండా నిర్మాణ సంస్థే పూర్తి చేస్తానని చెప్పినా ప్రభుత్వం పనులు చేయడం లేదని ఆరోపించారు.
రాజకీయం చేయడానికి ఇక్కడికి రాలేదు కేసీఆర్, పట్టుదలతో 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుందని, వర్షాలు కురవకపోయినా కన్నెపల్లి వద్ద నీరు ఎప్పుడు నిలువ ఉంటుందని అన్నారు. మీకు చేతకాకపోతే కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తారన్నారు.










