నిజామాబాద్, జూలై 5
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లున్నర పూర్తయినా రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు విమర్శించారు.
ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లున్నర పూర్తవుతున్నప్పటికీ కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వరకు వెళ్లిన కేటీఆర్‌ను అడుగడుగునా అడ్డుకోవడం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు.
లక్ష క్యూసెక్కుల వరద నీటిని వినియోగించకుండా సముద్రంలోకి వదిలేస్తూ, రైతులకు సాగునీరు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నాయనే సాకుతో మొత్తం కాళేశ్వరం వ్యవస్థను నిలిపివేయడం సమంజసం కాదన్నారు. మెడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
సాగునీరు అందితే రైతులు సమృద్ధిగా పంటలు పండించగలరని, అయితే పంటల కొనుగోలు, ఎరువుల సరఫరా, బోనస్ చెల్లింపులు వంటి బాధ్యతలను తప్పించుకునేందుకే ప్రభుత్వం సాగునీటిని అడ్డుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కేటీఆర్ కన్నెపల్లి పర్యటనతో ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం తరఫున కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.












